Renu Desai

రేణూ దేశాయ్‌.. పరిచయం అక్కరలేని పేరు. పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యగా ప్రస్తుతం పిలుస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రస్తుతం రేణూ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వ్యవసాయం పట్ల ఆమె ఆకర్షితురాలై.. రైతుల కష్టాలను తెలుసుకుంటూ.. తన దారి వేరు అనేలా రేణూ దేశాయ్‌ నడుస్తోంది. అతిత్వరలో తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తానంటూ తన రీ ఎంట్రీ విషయాన్ని చెప్పేసింది రేణు దేశాయ్. ఈ మేరకు తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ పెట్టింది.

తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ”ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు రావడం ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఓ అందమైన వెబ్‌ సిరీస్‌లో చేసేందుకు సైన్ చేశాను. అక్టోబర్‌లో ఈ వెబ్‌ సిరీస్ షూటింగ్‌ ప్రారంభం కానుంది. నిజాన్ని ఛేదిస్తూ న్యాయం కోసం పోరాడే బలమైన మహిళగా నటించనుండటం చాలా ఆతృతగా ఉంది. మీ అందరి నుంచి సపోర్ట్ ఆశిస్తున్నాను. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎమ్‌.ఆర్‌. కృష్ణ మామిడాల. నిర్మాతలు డిఎస్‌. రావు, ఎస్‌. రజినీకాంత్‌. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తా” అని పేర్కొంది రేణు దేశాయ్.