online classes

విద్యార్థులకు ఆన్‌లైన్‌ పద్ధతిలో పాఠాలు బోధించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు స్కూల్‌ పాఠాలు బోధించనున్నారు. టీశాట్‌, ఆన్‌లైన్‌ ద్వారా ఈ విద్యాబోధన కార్యక్రమం జరగనుంది. ఆన్ లైన్ తరగతుల కోసం ఇప్పటికే జూబ్లీహిల్స్‌ టీ శాట్‌ టీవీ స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీ శాట్‌ సీఈఓ శైలేష్‌ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10 తరగతిలోపు విద్యార్థులకు ఆన్‌లైన్‌, టీవీల ద్వారా పాఠాలు బోధిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని సర్వీస్ ప్రొవైడర్లకు ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. విద్యార్థులు డిజిటల్‌ విధానంలో పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా షెడ్యూల్‌ రూపొందించామన్నారు.

Schools in Telangana asked to conduct online classes with restricted screen  timings

15 రోజులకు సంబంధించిన టైం టేబుల్‌ను ముందుగానే ఫిక్స్ చేశామన్నారు. షెడ్యూల్ టైమ్‌ వివరాలను వెబ్ సైట్ , యూట్యూబ్‌లో పెడుతున్నామని అన్నారు. మిస్ అయిన క్లాసులను కూడా టి శాట్ యూట్యూబ్, వెబ్‌సైట్‌‌లో మళ్ళీ చూడొచ్చని తెలిపారు. భవిష్యత్ మొత్తం ఆన్‌లైన్‌పై ఆధారపడిన నేపథ్యంలో పిల్లలకు ఇప్పుడే అవగాహన రావడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు.ఇక విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి పాఠాలను సాయంత్రం వేళల్లో తిరిగి ప్రసారం చేస్తామని తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు అనేవి ఉండవని, పవర్ కట్ ప్రాంతాల్లో మళ్ళీ పాఠ్యంశాలను తిరిగి ప్రసారం చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రసారాలు ఉంటాయని తెలిపారు.