sp balasubrahmanyam

కరోనా వైరస్, లాక్‌డౌన్‌ కారణాలతో ఎస్పీ బాలు గత కొంతకాలంగా తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని చెన్నైలోని తన ఇంట్లోనే ఉంటున్నారు. ఈనెల 5న ఆయనకు కరోనా వైరస్‌ సోకడంతో చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్ప త్రిలో చేరారు. ‘‘దయచేసి పరామర్శించడానికి ఫోన్లు చేయొద్దు. మాట్లాడలేను. త్వరలో ఇంటికి వచ్చేస్తాను’’అని ఆ రోజు బాలు స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ‘బాలు స్వల్పమైన కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు’అని గురువారం సాయంత్రం ఆస్పత్రి వైద్య సిబ్బంది విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

ఆయన రక్తంలో ఆక్సిజన్‌ శాతం సరిపడేంతగా కూడా ఉందని తెలిపారు. అయితే, గురువారం రాత్రి ఒక్కసారిగా బాలు ఆరోగ్యం విషమంగా మారడంతో వెంటనే ఐసీయూకి తర లించి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన మరో బులెటిన్‌లో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు వెంటిలేటర్‌ అమర్చారని, వైద్య నిపు ణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కుటుంబ సభ్యుల సమాచారం. మరోవైపు ఎస్పీబీ భార్య సావిత్రికి శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వారు తెలిపారు. ఎస్పీ బాలు ఆరోగ్యంపై చాలామంది ఆందోళన చెందడంతో ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌.. ట్విట్టర్‌ ద్వారా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలిపారు.