
Sri Rama Navami 2023 : ఒకసారి రావణాసురుడు సంధ్యావందనం చేసుకునేందుకు సరస్సులో దిగి సూర్యునికి అంజలి ఘటిస్తుండగా అకస్మాత్తుగా ప్రవాహం పెరిగి నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి వచ్చి అంజలి ఘటించడానికి వీలు పడదు. ఏమి జరిగిందో చూద్దమని వెళ్తే అక్కడ కార్తవీర్యార్జునుడు తన వేయి చేతులతో స్నానం చేస్తూ ఉండడం వలన ప్రవాహానికి అవరోధం కలిగి నీటి మట్టం పెరిగి అలా సంభవించింది అని తెలుసుకుంటాడు. ఈ సమయంలో ఇరువురి మధ్య అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో కార్తవీర్యర్జునుడే గెలుస్తాడు. రావణాసురునకు పరాభవం జరుగుతుంది.అంతటి మహా వీరుడైన కార్తవీర్యార్జుని ని పరశురాముడు ఓడిస్తాడు.
సీతమ్మవారి స్వయంవరంలో శివధనస్సును విరిచే సందర్భములో వచ్చిన సవ్వడి యావత్ ప్రపంచం వింటుందట. ఆ సవ్వడి పరశురాముడికి చేరి మళ్ళీ ఎవరో రాజవంశీయుడు వచ్చి ఉంటాడని భావించి శ్రీరాముడితో తలపడతాడు. భంగపడతాడు . ‘పరశురామా! దశరథరాముడి సందర్శనం అయ్యాక, నీవు శస్త్రం పట్టవద్దు. ఎందుకంటే నీ వైష్ణవ తేజస్సు అతనిలో ప్రవేశిస్తుంది. అ సురకార్యం నిర్వహిస్తుంది. నీలో వైష్ణవ తేజస్సు ఉన్నంతకాలమే నీవు శత్రుగణాలను చెండాడగలవు (తవ తేజోహి వైష్ణవం రామం ప్రవేక్ష్యతి) అని శంకరుడు పరశురాముణ్ణి లోగడ హెచ్చరించడమే దీనికి కారణం. ఒక విష్ణు అవతారం మరో విష్ణు అవతారాన్ని ఓడించిన సదర్భం ఇదొక్కటే. ఇక్కడ గమనించారా రావణాసురిని ఓడించినవాడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు ని ఓడించినవాడు పరశురాముడు. పరశు రాముని ఓడించిన వాడు రాముడు. రావణాసురినితో తలపడక ముందే శ్రీరాముడు విజయం సాధించినట్లే. కానీ ఆయన మనిషి రూపంలో మనందరికీ ఆదర్శంగా నిలవడానికే వానరాల సహాయం తీసుకున్నాడు.నిజంగా ఎంతటి మహానుభావుడు శ్రీరాముడు.(content credit : sribhakthitattvamofficial)