fire accident in vijayawada covid centre

 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజూ 10 వేల దాకా నమోదవుతున్నాయి. ఏ కరోనా ఆస్పత్రి చూసినా రోగులతో నిండిపోతోంది. ఇలాంటి సమయంలో... విజయవాడలోని కొవిడ్ చికిత్సా కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

విజయవాడలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఏలూరు రోడ్డులోని రమేష్‌ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా హోటల్ స్వర్ల ప్యాలస్‌ని ఉపయోగిస్తోంది. అక్కడే మంటలు వ్యాపించి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సీపీ శ్రీనివాసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ భవనంలో 40 మంది వరకు ఉండగా.. వీరిలో 30మంది కొవిడ్‌ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది వున్నారు. అగ్నిప్రమాదం కారణంగా బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, బాధితులు కిటికీల్లో నుంచి కేకలు వేస్తూ భయాందోళనకు గురయ్యారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కింది అంతస్థులో మంటలు చెలరేగి భవనం పైభాగానికి విస్తృతంగా వ్యాపించాయి. తెల్లవారుజామున 4.45-5.00 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు గాఢనిద్రలో ఉండగా మంటలు చెలరేగి ఊపిరిడాక విలవిలాడారు. కొందరు కిటికీలో నుంచి దూకేశారు.

ప్రాణాలు కోల్పోయిన ముగ్గూరు కోవిడ్ పాజిటివ్ రోగులే. బాధితులను రమేశ్ హాస్పిటల్, ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తరలించారు. స్వర్ణప్యాలెస్‌ వద్ద సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దట్టంగా పొగలు అలముకోవడం వల్లే బాధితులు ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌ హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.